Thursday, April 27, 2017

నేను దేవుడిని

నేను దేవుడిని. 

అవును వినడానికి వింతగా ఉన్నా నేను దేవుడినే... 

దేవుడు అంటే సర్వాంతర్యామి.  కాబట్టి ఆయన నాలోనూ ఉన్నాడు కనుక నేను దేవుడిని అని చెప్పడం లేదు. 

మీరు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను దేవుడిని . 

అవునా ? అయితే నువ్వు దేవుడు అని నిరూపించు అంటారా ? నాకేం అవసరం.  మీకు నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నిజంగా నేను దేవుడి దగ్గరకి వెళ్లి నువ్వు దేవుడు అని నిరూపించుకో అంటే నిరూపించుకోడుగా ! 

నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ మాయ చెయ్యి, ఈ మంత్రం వెయ్యి అంటే వెయ్యడుగా. నేనుకూడా అంతే. మీకు నిరూపించుకోను. మీరు నమ్మండి పూజలు చెయ్యండి, దీక్షలు చెయ్యండి మీ కోరికలు అన్ని నెరవేరుతాయి. 
అసలు దేవుడు ఉన్నాడా ? లేడా ? (దేవుడు ఉంటే ఏ మతానికి చెందిన వాడు అనే ప్రశ్న వదిలేద్దాం). 

కాసేపు దేవుడు లేడు అనుకుందాం. దేవుడు లేకపోతే మనం వింటున్న కథలన్నీ ఎలా వచ్చి ఉంటాయి ?

  • కొన్ని సంవత్సరాల క్రితం (సుమారు 10 సంవత్సరాలు)  నేను 'untold history' అని లేదా అలాంటి పేరుతో ఉన్న ఒక బ్లాగ్ చదవడం జరిగింది. అందులో చరిత్రలో మనం చదువుకుంటున్న ఎన్నో సంగతులు నిజం కాదని వాటికి ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ఆధారాలను ప్రస్తావించడం కూడా జరిగింది. కానీ అవి నాకు ఇప్పుడు గుర్తులేవు. అయితే ఈ మధ్య అంతర్జాలం లో తాజ్ మహల్ ఒక హిందూ దేవాలయం అని కొన్ని ఆర్టికల్స్ మరియు వీడియోలు చలామణీ అవుతుండడం చూసే ఉంటారు. ఈ తేజో మహాలయ గురించి కూడా అప్పట్లో ఆ బ్లాగ్ లో ప్రస్తావించబడింది.  వాళ్ళ చరిత్ర వాళ్ళకి నచ్చిన విధంగా తయారు చేసి చలామణీ చేశారనీ చాలామంది అంతర్జాలంలో చాలా సమాచారం పెట్టారు. కొన్ని తరాల తర్వాత పుట్టిన మనకి పుస్తకాల్లో ఉన్నదే నిజం అనుకుని అదే చదువుకుని అదే నమ్మేసాం అని ప్రస్తావించారు. 
  • కొందరు సినిమా తారలకు ఆలయాలు కట్టించడం మనం చూసాం. అలాగే ఒక నాయకుడి కోసం దీక్ష తీస్కుని, మాల వేసుకున్న భక్తులు లేదా అనుచరుల గురించి కూడా వార్తల్లో చూసాం. ఈ దీక్షలు కొన్ని తరాల పాటు ఇలానే కొనసాగాయి అనుకుందాం. తర్వాత తరం వారు భక్తి గీతాలు, దీక్షా సూత్రాలు రాసి తర్వాత తరాల వాళ్ళకి అందించారు అనుకుంటే, కొన్నితరాలు పోయిన తర్వాత ఇప్పటి మన సినీ తారలు దేవుళ్లు అయిపోయి వరాలు ఇస్తూ ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు. 
  • ఒక సాధువు గారు ఒకసారి ఒక ప్రయోగం చేశారట. ఒక విష సర్పాన్ని తీసుకొచ్చి. ఎవరైతే ఆయనని నమ్మకం గురించి ప్రశ్నించారో వారిని పిలిపించి రోజు పాముని పరిచయం చేసే వారుట. అది ఎంత ప్రమాదకరమైన పాము, ఒకవేళ కాటు వేస్తే ఎలాంటి పరిణామాలు మానవ శరీరంలో చోటు చేసుకుంటాయి. నిన్ను ఎక్కడ ఆ పాము కరిస్తే ఎక్కడ నుండి విషం ఎలా ప్రవహించి నువ్వు ఏమైపోతావు అని చెప్పడం చేసే వారు. ఒకరోజు ఆ వ్యక్తి కళ్ళకి గంతలు కట్టి ఇప్పుడు పాముతో కరిపించబోతున్నాను అని నమ్మబలికి పాము బుస కొట్టే సమయానికి ఆయనకి ఎక్కడైతే కాటు వేయిస్తా అన్నారో అక్కడ ఒక సూదితో గుచ్చారు. ఆశ్చర్యంగా నిజంగా పాము కరిస్తే ఏమేం జరుగుతాయో అవన్నీ అతనికి జరగడం గమనించి అక్కడున్న జనం ఆశ్చర్య పోయారట. 
ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. అంటే మనం గట్టిగా నమ్మితే అదే మనకి అనుభవం అవుతుంది. పాము అనుకుని చూస్తే చీకట్లో తాడు కూడా కదిలినట్లే కనిపిస్తుంది కదా ! నిజానికి తాడు కదలదు.  కానీ, మన ఆలోచనలో కదిలినట్లు ఊహించుకుంటాం. అలానే మన జీవితం లో జరిగే సంఘటనలను మనం లంకె పెట్టి చూసుకుంటాం. ఫలానా కారణం వల్లనే ఇది జరిగింది అని నమ్ముతాం. 
భయం : 
సాధారణంగా మనిషి తనకు తెలిసిన దానికన్నా తెలియని దానికి ఎక్కువ భయపడతాడు అంట. అక్కడేదో ఉందనో, ఒకవేళ ఎవరు లేనపుడు ఒంటరిగా ఉన్నపుడు ఏదో జరిగిపోతుందేమో లాంటి విషయాల్లో ఎక్కువ భయపడతాడు. అలానే అందరూ నమ్ముతున్నారు నేను నమ్మకపోతే నాకు ఏమైపోతుందో అని కూడా భయపడతాడు. 
ఆత్మవిశ్వాసం: 
కొంతమందికి తమ సొంత సామర్థ్యం మీద నమ్మకం తక్కువ. అలాంటప్పుడు వేరే మానవాతీత శక్తి మీద ఆధారపడతారు. ఒక వ్యక్తి  సిఫారసు లెటర్ ఉన్నపుడు ఎంత ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాడో అలాగ నాకు ఒకరి అండ ఉంది అనే ధైర్యం తో ముందుకు వెళ్తాడు. తనవల్ల కాదు అనుకున్న విషయాన్ని ఆ మానవాతీత శక్తి మీద బాధ్యత పెట్టేసి కొంత మానసిక భారం బదిలీ చేస్తాడు. నైపుణ్యం ఎంత ఉన్నా ఆత్మ విశ్వాసం పాత్రని తక్కువ చెయ్యలేం కదా!

ఒప్పుకోలేకపోవడం: 
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనిషి ప్రాణాలను శాశ్వతంగా కాపాడలేము. ఎంతగా ప్రేమించినా మనకి దక్కుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. అలానే కొన్ని మనం ఎంత ప్రయత్నించినా మన చేతుల్లో ఉండవు. ఈ విషయం మనం అర్థం చేస్కుని మానసికంగా సిద్ధపడాలి. కానీ చాలామంది మనకెందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తారు తప్ప ఇలా కూడా జరగొచ్చు కదా అని అనుకోలేరు. జరిగిన దాన్ని జీర్ణించుకోలేరు. 

కోరిక: 
ఉన్నదానితో తృప్తి పడడం చాలా చాలా కొద్దిమందికి  మాత్రమే సాధ్యం. ఉన్నదాన్ని పదింతలు ఎలా చెయ్యాలా? అని ఆలోచించే వారే మనలో అధికం. తమ తెలివితో, సామర్థ్యంతో కొంతవరకు సాధించగలరు కానీ ఆశ అక్కడితో ఆగదుకదా! అంతులేని ఆశల కోసం దేనికైనా సిద్ధం. 

ఇలా చాలా చాలా కారణాల వల్ల మనకి దేవుడి అవసరం ఉంది. అలాంటి అవసరాలే మనకి దేవుడిని సృష్టించాయి. అదే దేవుడితో మనం వ్యాపారం మొదలు పెట్టేసాం. అలా కాకుండా మరేం చెయ్యాలి. మనకి కలిగే భయాలకి కారణాలు వెతికి మన భయాలు మనమే పోగొట్టుకోవచ్చు. మన బలహీనతలు ఒక్కొక్కటి అర్థం చేసుకుని కొంచెం సాధనతో వాటిని ఒక్కొక్కటిగా బలంగా మార్చుకోవచ్చు. మనం చాలా పరిమితమైన వాళ్ళం, మనం కొన్ని మాత్రమే చెయ్యగలం. మనం ఎంత సమర్థులం అయినా, ఎంత గొప్పవాళ్ళం అయినా కొన్ని మన చేతుల్లో ఉండవనే నిజాన్ని అర్థం చేసుకోవాలి. కోరికలు పరిమితం చేసుకుని సంతృప్తి పొందడం నేర్చుకోవాలి. రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తూ నిమిషం ఖాళీ లేకుండా సంపాదన తప్ప మరేం పట్టకుండా ఉండేవాడికన్నా జీవితాన్ని ఆస్వాదిస్తూ బ్రతికిన పేదవాడే ఎక్కువ తృప్తిగా ఉండగలడు. ప్రపంచం ముందు గొప్పలకు పోవడం మాని మనలోకి మనం చూసుకోడం మొదలైన రోజున మనకన్నా సంతోషంతో ఎవరూ ఉండరు. 

పైన ఎలాంటి కారణాల వల్ల నీకు దేవుడు అవసరం ఐయ్యాడో, అలాంటి అవసరాల్లో ఉన్నవాడిని సొంతకాళ్ళ మీద నిలబడేలా చేస్తే నువ్వే వాడికి దేవుడివి. 



ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుందాం. 
దేవుడు నుండి మనం ఏమి ఆశిస్తున్నాం? మనలో అందరం దేవుడు నుండి ఏదో ఒకటి ఆశించి మాత్రమే పూజిస్తున్నాం. కోరికలు మాత్రమే కోరుతున్నాం. మన కోరికలు తీర్చడం ఆయన బాధ్యత అన్నట్లు ప్రవర్తిస్తున్నాం. మన కోరిక తీరకపోతే నిందిస్తున్నాం. 

సరదాగా కాసేపు మనమే భగవంతుడు అనుకుందాం.  ఏమైనా చెయ్యగలం, అన్నీ తెలిసిన వాళ్ళం, అన్ని చోట్లా వ్యాపించి ఉన్నాము మరియు ఎవరికీ హాని చెయ్యము అందరికీ మంచి మాత్రమే చేసే అత్యంత మంచి వాళ్ళం. ఇంకా ఏమన్నా దేవుడి గుణాలు ఉంటే అవన్నీ మనకి కూడా ఉన్నాయ్ అనుకుందాం. 

భయం: 
మనకి చిన్నప్పుడు చీకటి అంటే చాలా భయం ఉండేది. కానీ మనం పెరిగేకొద్దీ కొంచెం కొంచెం ఆ భయం తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోయింది? కొన్నాళ్ళు ఎవరో ఒకరి తోడు తీసుకుని చీకటి లోకి వెళ్ళేవాళ్ళం. కొన్నాళ్ళకి దూరంగా మనకి కనపడేలా ఉండమని మన పని పూర్తి చేస్కుని వచ్చేవాళ్ళం. తర్వాత ఒంటరిగా వెళ్లి వేగంగా వచ్చేసేవాళ్ళం. అక్కడ వెలుగు లేదు తప్ప మిగతా అంతా ఎప్పటిలానే ఉంది అని తెలిసాక నెమ్మదిగా భయం పోయింది మనకి. 

జీవితంలో కూడా అంతే. ఏదో మనకి తెలియని ఏదో ప్రమాదం వస్తుంది అన్న భయం వచ్చినపుడు మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. అప్పుడు ఆయన కొంచెం కొంచెం మనకి పరిస్థితులని అలవాటు చేసి నెమ్మదిగా మన కాళ్ళమీద మనమే నిలబడేలా చేస్తారు. నేనే దేవుడు అయితే అలానే చేస్తాను గాని ప్రతిసారి నా మీదనే ఆధార పడాలి అనుకోను. మనం ఉద్యోగం చేసే దగ్గర కూడా మన పై అధికారి మనకి అలవాటు ఐయ్యేవరకు సాయం చేసి నెమ్మదిగా మనకి బాధ్యతలు అప్పజెప్పి తను తనపనులు చేసుకుంటాడు గా. 

ఈ ఉదాహరణ తో మనం దేవుడి మీద ఎంత వరకూ ఆధార పడాలి అంటే మనం నేర్చుకునే వరకు మాత్రమే. ఎప్పటికీ నువ్వు పక్కనే ఉండాలి అంటే మన పై అధికారి కూడా మనల్ని తీసేసి వేరే వారిని మన స్థానంలో కూర్చోబెట్టుకుంటారు. 

అన్నీ తెలిసిన వారూ ఏమీ తెలియని వారూ ఎవరూ ఉండరు. మన భయాలూ, బలహీనతలూ మనమే గుర్తించాలి. మన బలహీనతలు మనమే బలంగా మార్చుకోవాలి. చరిత్ర పుస్తకంలో 
పాఠాలుగా మారిన వారు అందరూ బలహీనతలు లేకుండా పుట్టలేదు. వాటిని తగ్గించుకుని, తొలగించుకుని గెలిచారు. 


ఆత్మవిశ్వాసం:
నా భక్తుడు సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి. సైకిల్ నడిపించడానికి కావాల్సిన సమాచారం అంతా చెప్పేసాక, నేను వెనకాల పట్టుకుంటాను నువ్వు నడిపించు అని చెప్పి ఏదో ఒకరోజు నేను వెనకాల పెట్టుకోకుండా ముందుకు పంపించేస్తాను. పడినా పర్వాలేదు. దెబ్బ తగిలినా పరవాలేదు. ఎందుకంటే నేను పట్టుకునే ఉన్నంతకాలం వాడికి సైకిల్ నడపడం రాదు కాబట్టి. ఒకసారి కూడా పడిపోకుండా సైకిల్ కూడా నేర్చుకోలేము కదా ! మరి జీవితాన్ని మాత్రం ఎలా నేర్చేసుకుంటాం. 

నా భక్తుడు సైకిల్ సొంతగా నేర్చుకుని అవసరం అయితే నన్నో, మరొక మిత్రుడినో వెనకాల ఎక్కించుకుని వెళ్ళాలి అనుకుంటాను తప్ప, జీవితాంతం వాడి సైకిల్ వెనకాల పట్టుకుని నేను నడిపించాలి అనుకోను. 

వెనకాల వదిలేసినా కూడా నేను నడపగలిగాను అంటే ఎవరూ లేకుండా కూడా నేను నడపగలను అనే విశ్వాసం వచ్చిన రోజునే సొంతంగా సైకిల్ తొక్కడం ప్రారంభిస్తాడు మన భక్తుడు. అంటే మనం విశ్వాసం నుండి ఆత్మ విశ్వాసం వచ్చే వరకే దేవుడు సాయం చేస్తాడు. 

ఒప్పుకోలేకపోవడం: 
ఈ అనంత విశ్వంలో మనం చాలా చిన్నవాళ్ళం. మనం కొన్ని మాత్రమే చెయ్యగలం. చాలా విషయాలు మన చేతుల్లో ఉండవు. ఈ నిజాన్ని మనం జీర్ణించుకోగలగాలి. మనం ఏం చేసినాకూడా మనం ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ ప్రాణాలతోనే మనతోనే ఉండేలాగా చేయగలమా ? పోనీ మనం చావుని ఎదిరించగలమా? లేదు. చావు అనేది పెద్ద ఉదాహరణ కావొచ్చు. కానీ మనకు దూరం అయిన చాలా వాటిల్లో మనం పరిశీలించుకుంటే మన చేతుల్లో లేని విషయాలే చాలా ఉంటాయి. అది దూరం అవ్వడం, లేదా మనం అనుకున్నది జరగకపోవడం అనేది నిజం. అది ముందే జరిగిపోయింది. ఆ నిజాన్ని మనం అర్థం చేస్కుని జీర్ణించుకోలేకపోవడం వల్లనే మనం చాలా సార్లు కంటతడి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 

తనది కాని దానికోసం బాధ పడే నా భక్తుడికి నేనేమీ చెయ్యను. ఎందుకు అంటే నేనేమీ చెయ్యలేను కాబట్టి. తనది ఐన దాన్ని తనదగ్గరకి చేర్చగలను గానీ తనది కాని దానికోసం ఎంత ఏడ్చినా నేనేం చెయ్యను ? చిన్నప్పుడు పక్కింటి వాళ్ళ వస్తువులు మనం మనకి నచ్చి తెచ్చేస్తే ఇంట్లో అమ్మ గానీ, నాన్న గానీ చూస్తే వాళ్ళకి తీసుకెళ్లి తిరిగి ఇచ్చేస్తారుగా! లేదా వాళ్లే తెలిస్తే వచ్చి తీసుకుని వెళ్ళిపోతారుగా. జీవితంలో కూడా అంతే. మనకి ఇవన్నీ బాగా తెలుసు కానీ ఆ పరిస్థితి వచ్చినపుడు మనకి మనం అన్వయించుకుని బాధపడకుండా ఉండేలా చేసుకోడమే సాధన. 

కోరిక: 
మన కన్నీళ్ళన్నిటికీ కారణం మన కోరికలే. అది మనకి కూడా తెలుసు. సరే ఇప్పుడు నువ్వు దేవుడివి కదా! నేను రోజు ఉదయాన్నే నీ దగ్గరకి వచ్చి నీ చుట్టూ ప్రదక్షిణలు చేసి, నీ పేరుని కొన్ని వందల సార్లు నీకు వినిపించేలాగాను, నా మనసులోనూ స్మరించేసి నాకు ఏదో కావాలి అని అడిగాను అనుకో నువ్వు ఇస్తావా? నేనెవరికీ సాయం చెయ్యను, ఎవరినీ పట్టించుకోను, దొరికిన వరకు, కుదిరిన వరకు ఎలాగోలా ఇంకా ఎక్కువ సంపాదించడం ఎలా అనే ఆలోచనలో మాత్రమే ఉంటాను. కానీ నీకు మాత్రం అభిషేకాలు చేసేస్తాను. పైగా నాకు ఒక లక్షరూపాయలు ఇస్తే నీకు వంద రూపాయలు హుండీలో సమర్పిస్తాను, లేదా ఇంకో నూట ఎనిమిది సార్లు నా అందమైన మొహాన్ని నీకు చూపిస్తూ ప్రదక్షిణలు చేస్తాను అంటే నా కోరికలు తీరుస్తావా? 

మిత్రమా! మన కోరికలు మనమే తీర్చుకోవాలి. నువ్వు అవసరంలో ఉన్నపుడు మాత్రం నీకు సమయానికి అందాల్సిన సాయం అందుతుంది. దీన్నే అదృష్టవశాత్తూ అంటాం, దేవుడు రూపంలో వచ్చి సాయం చేసావు అంటాం, సూపర్ ఎక్స్ అంటాం లేదా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటాం. అవసరాలకి అంతం ఉంటుంది కాబట్టి సాయం అందుతుంది. కోరికలు అంతం లేనివి. 

ఇక్కడ నా ఆలోచనలు కొన్ని ప్రస్తావించాలి అనుకుంటున్నాను. 

నేను చిన్నప్పటి నుండీ మంచిగానే ఉన్నాను. కానీ నాకు కష్టాలు వస్తూనే ఉన్నాయ్. మంచిగా ఉండడం వలన ఏమి ఉపయోగం జరిగింది నాకు అనుకుంటాం. కానీ మనం మంచిగా ఉండడం వలన మన వల్ల ఎవరికీ హాని జరగలేదు కదా ! చెడు జరగలేదు అంటే మంచి జరిగినట్లే కదా! అలానే ప్రతి వాడూ పక్కవాడిని పట్టించుకుంటే అసలు మనషికి అధైర్యం ఎక్కడిది? కానీ బాధా కరమైన విషయం ఏంటీ అంటే సాటి మనిషి నుండి రక్షణకోసం కూడా మనం మానవాతీత శక్తి మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. 

దేవుడి ఫోటో జేబులోనో ఎదురుగానే పెట్టుకుంటే మంచిది. అలా అని జరిగే ప్రమాదం ఏదో ఆగిపోతుంది అని కాదు. దేవుడు చూస్తున్నాడని భావనలో మనం ఏ తప్పు చెయ్యకుండా ఉంటామని. ఏ తప్పూ చెయ్యకపోవడం మంచే కదా! 

మనం ఒకరికి సాయం చేస్తే, మనం గొప్పగా భావించకూడదు అంట. సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడివి అయి ఉండాలి. మనం ఎప్పుడైతే సాయం చేశాం అనుకుంటామో ఎదుటివారినుండి ఆశించడం మొదలు పెడతాం. నేను ఇంత సాయం చేశాను కాబట్టి నాకు ఇలాంటి సమస్య వస్తే అవతలి వాళ్ళు కూడా నాకు ఇంత సాయం చేస్తారు అని ఆశిస్తాం. అలా జరగకపోతే నేను ఇంత చేశాను కానీ నాకు వాళ్ళు చెయ్యలేదు అని బాధపడడం మొదలు పెడతాం. బంధాలని కూడా దూరం చేసుకుంటాం. అందుకే చేసిన సాయం మర్చిపోవాలి. పొందిన సాయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అని. 

ఇక్కడ నేను కొన్ని మాత్రమే ఉదాహరించాను. ఇలాంటివి చాలా ఉంటాయి. ఒకటి మాత్రం నిజం దేవుడు ఉన్నా లేకున్నా చివరకి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. కానీ మనల్ని తప్పుదోవ పట్టించి చాలా మంది నిజమైన నిన్ను, నిజమైన దేవుడిని తెలుసుకునే ప్రయత్నం చెయ్యనీకుండా చేస్తున్నారు. మన పూజలో చేసే ప్రతి పనిలో ఒక పరమార్థం ఉంటుంది. అది తెలుసుకోవడం మానేసి వేషాలకి మోసపోతున్నాం. దేవుడు అనే సూపర్ పవర్ తో వ్యాపారం చేసేస్తున్నాం. ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదు. భగవంతుడు మనకు ప్రేమతో ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడం. స్వార్థం విడిచి స్వచంగా ఉండడం. 

కానీ, మనం ఏమి చేస్తున్నాం? 

సాటి మనిషికి తోడుగా ఉంటూ, ప్రకృతిని పచ్చగా ఉంచినంత కాలం మనిషే దేవుడు. నిత్యసంతోషి.

- మీ నేస్తం వంశీ కమల్